![]() |
![]() |
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అనగానే మనకు యాక్షన్, మాస్ ఎంటర్‌టైనర్ సినిమాలే గుర్తుకొస్తాయి. అయితే ఆయన కెరీర్ ప్రారంభంలో ఒక పౌరాణిక చిత్రంలో శ్రీరాముడి పాత్రలో నటించాల్సి ఉందనే ఆసక్తికర విషయం చాలామందికి తెలియదు. ప్రస్తుతం బాలీవుడ్‌లో రణ్‌బీర్ కపూర్ హీరోగా నితీష్ తివారీ 'రామాయణం' సినిమా తెరకెక్కిస్తున్న తరుణంలో, సల్మాన్ ఖాన్ పాత రామాయణం ప్రాజెక్ట్ మళ్లీ నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
ఈ ప్రాజెక్ట్ 1990ల కాలంలో గ్రాండ్ లెవెల్ లో ప్రారంభమైంది. సల్మాన్ ఖాన్ తమ్ముడు సోహైల్ ఖాన్ దర్శకత్వంలో రూపొందాల్సిన ఈ చిత్రంలో శ్రీరాముడి పాత్రకు సల్మాన్ ఎంపికయ్యారు. అలాగే సీతగా అప్పట్లో కుర్రకారు కలల రాణి అయిన సోనాలి బింద్రేను ఫైనల్ చేశారు. ఈ చిత్రంలో పూజా భట్ కూడా ఓ కీలక పాత్ర పోషించడానికి అంగీకరించారు.
అప్పట్లో ఈ సినిమా కేవలం ప్రకటనలకే పరిమితం కాలేదు. ఏకంగా 40 శాతానికి పైగా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. సల్మాన్ ఖాన్ చేతిలో విల్లు పట్టుకుని, రాముడి వేషధారణలో కనిపించిన ప్రచార చిత్రాల ఫోటోషూట్ కూడా అప్పట్లో నిర్వహించారు. ఇండస్ట్రీలో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్న సమయంలో ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి.
సాధారణంగా సినిమాలు ఆర్థిక కారణాలు లేదా డేట్ల సర్దుబాటు కాక ఆగిపోతుంటాయి. కానీ ఈ సినిమా విషయంలో వ్యక్తిగత కారణాలు అడ్డంకిగా మారాయి. షూటింగ్ సమయంలో దర్శకుడు సోహైల్ ఖాన్, నటి పూజా భట్ మధ్య పెరిగిన సాన్నిహిత్యం కుటుంబంలో కొన్ని విబేధాలకు దారితీసింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు సల్మాన్ ఖాన్ ప్రయత్నించినప్పటికీ, వివాదం సర్దుమణగలేదు.
అంతిమంగా పూజా భట్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో సినిమా నిర్మాణం పూర్తిగా నిలిచిపోయింది. అలా 40 శాతం పూర్తయిన ఓ భారీ రామాయణ చిత్రం సెట్స్ పైనే ఆగిపోయింది. ఒకవేళ ఈ సినిమా రిలీజ్ అయి ఉంటే, సల్మాన్ ఖాన్ సినీ ప్రయాణంలో అదొక ప్రత్యేకాధ్యాయంగా నిలిచేదనడంలో సందేహం లేదు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ రేర్ ఫ్యాక్ట్ విన్న సల్మాన్ అభిమానులు, మూవీ లవర్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ ను రాముడిగా ఊహించుకోవడం చాలా కొత్తగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా, ప్రస్తుతం రణ్‌బీర్ 'రామాయణం' హడావుడి మధ్య సల్మాన్ ఖాన్ నిలిచిపోయిన పాత రామాయణ చిత్రం ట్రెండింగ్ పిక్‌గా మారింది.
Salman Khan, Ramayana Movie, Pooja Bhatt, Sonali Bendre
![]() |
![]() |